కడప
జిల్లా నందలూరులోని ప్రాచీన, ప్రసిద్ధి గాంచిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా మేదినీపూజ, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘనంగా నిర్వహించారు.ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేదప్రబంధ శాత్తుమొర జరగగా, ఆపై సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణను ఆగమోక్తంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
జూలై 22న ధ్వజారోహణం
బుధవారం ఉదయం 7.45 గంటల నుండి 8.15 గంటల వరకు ధ్వజారోహణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారుల తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది.
కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం శ్రీ సౌమ్యనాథుడు
శ్రీ సౌమ్యనాథ స్వామివారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడిగా విశేష ఖ్యాతి పొందారు. గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మనోరథాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కోరికలు నెరవేరిన అనంతరం 108 ప్రదక్షిణలు చేయడం ఈ క్షేత్ర విశిష్ట సంప్రదాయంగా కొనసాగుతోంది.
వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన దివ్యక్షేత్రం
11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజుల పరిరక్షణలో పునర్నిర్మాణం పొందింది. ఆలయ గోడలపై 10వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు చెందిన శాసనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఆలయ ప్రాంగణంలో ఒకటి, వెలుపల మరొకటి ఇలా రెండు పవిత్ర కోనేరులు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
మహాకవి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ సౌమ్యనాథ స్వామివారిని కీర్తిస్తూ 16 సంకీర్తనలు రచించారు. అలాగే ఆలయ మండపంలోని స్తంభాలపై సింహాల శిల్పాలు ప్రత్యేక శైలిలో చెక్కబడి ఉండడం ఈ ఆలయ విశిష్టత. ఈ కారణంగానే ఆలయం క్రింద మరో ఆలయం ఉందని స్థానికులు విశ్వసిస్తుంటారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments