23.7.26

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి బ్రహ్మోత్సవాలు brahmotsavams





నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు గరుడ చిహ్నంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు.

అనంతరం స్వామివారి ఆస్థానం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు.

అంతకుముందు ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివారదేవతలతో కలిసి బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో దివ్యంగా విహరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు స్వయంగా పర్యవేక్షిస్తారనే విశ్వాసంతో ఈ ఊరేగింపును నిర్వహించడం ఆనవాయితీ.

ధ్వజారోహణం ద్వారా అష్టాదశ గణాలు, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు ఆగమశాస్త్రాలు పేర్కొంటాయి.

ఈ కార్యక్రమంలో  ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ప్రతిరోజూ వాహనసేవలు

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథస్వామివారు వివిధ దివ్య వాహనాలపై నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహనసేవల వివరాలు

జూలై 22: ధ్వజారోహణం – రాత్రి యాలి వాహనం

జూలై 23: ఉదయం పల్లకీ సేవ – రాత్రి హంస వాహనం

జూలై 24: ఉదయం పల్లకీ సేవ – రాత్రి సింహ వాహనం

జూలై 25: ఉదయం కల్పవృక్ష వాహనం – రాత్రి హనుమంత వాహనం

జూలై 26: ఉదయం శేష వాహనం – రాత్రి గరుడ వాహనం

జూలై 27: ఉదయం సూర్యప్రభ వాహనం – రాత్రి చంద్రప్రభ వాహనం

జూలై 28: ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం – రాత్రి గజ వాహనం

జూలై 29: ఉదయం 9 గంటలకు రథోత్సవం – రాత్రి అశ్వ వాహనం

జూలై 30: ఉదయం చక్రస్నానం – రాత్రి ధ్వజావరోహణం

జూలై 31: సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం

జూలై 28న ఆర్జిత కల్యాణోత్సవం

జూలై 28వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్థ దంపతులు రూ.500 టికెట్‌తో పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు టీటీడీ తరఫున ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదాలు అందజేయనున్నారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులకు ఆధ్యాత్మికానందం

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతం, హరికథ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

No comments :
Write comments