శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు రెండవ రోజైన శనివారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దివ్యానుభూతిని కలిగించాయి.
వైభవంగా స్నపన తిరుమంజనం
ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీరు, వివిధ రకాల పండ్లరసాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
వైభవంగా హనుమంత వాహనసేవ - భక్తులను పరవశింపజేసిన వేళ
సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు విచ్చేసి భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జూలై 19న గరుడ వాహనంపై భక్తులకు అభయప్రదానం
సాక్షాత్కార వైభవోత్సవాల చివరి రోజైన జూలై 19 (ఆదివారం) రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు గరుడ వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య దర్శనం, అభయప్రదానం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఎంఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ హరికృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments