11.7.26

చంద్రగిరిలో భక్తి పారవశ్యంతో శ్రీ మహాలక్ష్మీ దీప పూజ mahalakshmi deepa pooja










 

సకల సంపదలకు అధిష్ఠాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించే పవిత్రమైన శ్రీ మహాలక్ష్మీ దీప పూజ కార్యక్రమం శుక్రవారం చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళలు దీపాలను వెలిగించి అమ్మవారి అనుగ్రహాంతో ప్రార్థిస్తూ విశేష భక్తి భావంతో పాల్గొన్నారు.

 

భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్న ఎస్వీబీసీటీటీడీ అదనపు ఈవో

 

తిరుపతి, 2026 జూలై 10; టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల మన్ననలు పొందుతోందన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం అందిస్తోందని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలను పొందడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దేశ విదేశాల్లోని కోట్లాది మంది భక్తులు సైతం దివ్యానుభూతిని పొందారని పేర్కొన్నారు.

 

ప్రజల సుఖశాంతులే టీటీడీ సంకల్పంజేఈవో డాక్టర్ . శరత్

 

టీటీడీ జేఈవో డాక్టర్ . శరత్ మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులు, ఐశ్వర్యాలతో జీవించాలని సంకల్పించి టీటీడీ అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎస్వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ భక్తుల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందిస్తోందని తెలిపారు. టీటీడీ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.

 

చంద్రగిరి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాంఎమ్మెల్యే పులివర్తి నాని

 

చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని మాట్లాడుతూ, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మహిళలు విశేషంగా పాల్గొనడం ఆనందదాయకమని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

 

దీపం జ్ఞానానికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక :  హెచ్డీపీపీ కార్యదర్శి

 

హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ, దీపం జ్ఞానానికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక అని తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ దీప పూజ ద్వారా ప్రతి ఇంటా సుఖశాంతులు, ఐశ్వర్యం, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

 

వేదఘోషల మధ్య శాస్త్రోక్త పూజలు

 

అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీపలక్ష్మీ ఆరాధన, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు.

వేదమంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దివ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భక్తి సంకీర్తనలతో పరవశించిన భక్తజనం

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ముగింపులో నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

 

భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు

 

శ్రీ మహాలక్ష్మీ దీప పూజకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది.

 

కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, విజీవో శ్రీ గిరిధర్, హెచ్డీపీపీ అదనపు కార్యదర్శి శ్రీమతి కళ్యాణి, ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్, డీఈ శ్రీమతి సరస్వతి, అధికారులు, అర్చక బృందం, వేదపండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

No comments :
Write comments