తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 12న శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు శ్రీ లక్ష్మీనారాయణస్వామి వారి ఆలయం నుంచి ఉభయ నాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారిని, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగిస్తారు.
ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని శ్రీ కోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణస్వామి వారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అనంతరం శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర నిర్వహిస్తారు.
సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. అనంతరం శ్రీ ఆండాళ్ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది.
శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొరకు విశిష్ట ప్రాశస్త్యం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని మొదటి గోపురంలో పుష్యమి నక్షత్రం రోజున శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ప్రతిష్ఠించినట్లు ఆలయ సంప్రదాయం. స్వామివారి ప్రతిష్ఠాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్
శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ కాంచీపురంలో జన్మించిన ప్రముఖ సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే శ్రీవారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వంటి పవిత్ర రచనలను ఆయన అందించారు. శ్రీభాష్యం, శ్రీభాగవతం తదితర మహాగ్రంథాలకు వ్యాఖ్యానాలు కూడా రచించారు.
ఆయన జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొరను నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ చక్రత్తాళ్వార్, శ్రీ ఆండాళ్ అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.
.jpg)
No comments :
Write comments