పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 14న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఎన్. అమరనాథ్ రెడ్డితో కలిసి బుధవారం ఆయన దీప పూజ ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు. వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
దివ్య కాంతులతో ముస్తాబవుతున్న దీప పూజ వేదిక
టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు దీప పూజ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, సుందర పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జేఈవో సూచించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా పూజా ప్రాంగణంలో పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఏర్పాట్లు : ఎమ్మెల్యే
శ్రీ మహాలక్ష్మీ దీప పూజలో పాల్గొనే భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన మరింతగా పెంపొందించేలా ఏర్పాట్లు ఉండాలని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ఎన్. అమరనాథ్ రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, పవిత్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచాలని ఆయన కోరారు.
ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం
శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా ఆగష్టు 14న సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు. భక్తులు ఈ దివ్య దీప పూజను వీక్షించి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌డీపీపీ కార్యదర్శి డా. మేడసాని మోహన్, డీఈలు శ్రీమతి సరస్వతి, శ్రీ సర్వేశ్, ఏఈ శ్రీ చంద్రమౌళి, ఎస్వీబీసీ సీపీవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




No comments :
Write comments