తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానితో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జేఈవో సూచించారు. గత అనుభవాలను సమీక్షించి, లోపాలను సరిదిద్దుతూ భక్తులకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కల్పించాలని ఆదేశించారు.
ఆగస్టు 21న శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.
భక్తులకు విస్తృత సౌకర్యాలు
మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, పెండాళ్లు, సూచిక బోర్డులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని జేఈవో ఆదేశించారు. తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం విస్తృతంగా అందించడంతో పాటు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచాలన్నారు.
భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలని, ఆలయం, ఆస్థానమండపం పరిసరాలను పుష్పాలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించాలని సూచించారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలని, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు : ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని
మాట్లాడుతూ, వరలక్ష్మీ వ్రతానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రద్దీకి అనుగుణంగా తాగునీరు, మజ్జిగ, పెండాళ్లు, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. భక్తులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి కృపాకటాక్షాలతో చంద్రగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
13న ఆన్ లైన్ లో టికెట్ల విడుదల
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గం.లకు ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేయనున్నారు. ఆఫ్ లైన్ టికెట్లను ఒక రోజు ముందు ఆలయ ముందు ఉన్న కౌంటర్ లో విడుదల చేయనున్నారు.
వరలక్ష్మీ వ్రతానికి పురాణ ప్రాశస్త్యం
స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత విశిష్టతను, ఆచరించే విధానాన్ని వివరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాశస్త్యం ఉంది.
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించే మహిళలకు సత్సంతానం, దీర్ఘ సుమంగళీ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్‌ఈ శ్రీ నరసింహమూర్తి, డీఈ శ్రీ రవిశంకర్‌రెడ్డి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీ శ్రీహరిరావు, కేటరింగ్ అధికారి శ్రీ విజయభాస్కర్, ఆలయ అర్చకులు, పోలీసు, పంచాయతీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



No comments :
Write comments