13.8.26

శ్రీవారి సేవ "ట్రైన్ ది ట్రైనర్స్" రెండో విడత శిక్షణ 43 రోజుల్లో పూర్తి 10 బ్యాచ్‌లలో 1,888 మంది గ్రూప్ సూపర్‌వైజర్లకు శిక్షణ training




 శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక  విభాగం సహకారంతో  టీటీడీ  ప్రజా సంబంధాల శాఖ  43  రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది.

2026 జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ రెండో విడత శిక్షణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన 1888 మంది శ్రీవారి సేవ గ్రూప్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. మొద‌టి బ్యాచ్ తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 3000 వేల మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు.

సేవా నాణ్యత పెంపొందించడమే లక్ష్యం

శ్రీవారి సేవకుల్లో సేవా నైపుణ్యాలు, సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. శిక్షణ పొందిన ట్రైన‌ర్లు తమ తమ మండలాలు, జిల్లాల్లో ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న సేవకులకు తిరుమలకు వచ్చే ముందే శిక్షణ అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

దీంతో సేవకుల్లో సేవా నాణ్యత, అంకితభావం, బాధ్యతాయుత ప్రవర్తన మరింత పెరిగి, తిరుమలకు విచ్చేసే భక్తులకు సమర్థవంతమైన, క్రమశిక్షణతో కూడిన, భక్తి భావపూర్వక సేవలు అందించేందుకు దోహదపడుతుంది. 

సమగ్ర శిక్షణ

 వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీలోని వివిధ విభాగాల నిపుణులు, ఉపన్యాసకులు శ్రీవారి వైభవం, తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, పూజలు, కైంకర్యాల విశిష్టత, శ్రీవారి సేవ ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

సేవా కేంద్రాల్లో క్షేత్రస్థాయి శిక్షణ

 శిక్షణలో భాగంగా లడ్డూ కౌంటర్లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్ తదితర సేవా కేంద్రాలను శిక్షణార్థులు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సేవలు, సేవకుల బాధ్యతలు, వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలు, వాటిని సమర్థవంతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.

శిక్షణలో ప్రత్యేకతలు

ప్రతి బ్యాచ్‌లో సుమారు 200 మంది సేవకులకు శిక్షణ అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ కిట్, గ్రూప్ సూపర్‌వైజర్ ట్రైనింగ్ మాన్యువల్ అందించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించిన గోవింద నామాలు, భగవద్గీత, శ్రీనివాస గాథ, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం తదితర ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా అందించారు.

ప్రిన్సిపల్ సూపర్వైజర్లుగా విశ్రాంత గెజిటెడ్ ఆఫీసర్ల సేవలు

గ్రూప్ సూపర్వైజర్ల పని తీరును పర్యవేక్షించేందుకు ఆగస్టు 1వ తేది నుండి ఐదుగురు విశ్రాంత గెజిటెడ్ అధికారులను ప్రిన్సిపల్ సూపర్వైజర్లుగా నియమించడం జరిగింది. వీరు గ్రూప్ సూపర్వైజర్ల సేవలను అనునిత్యం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటారు.

మొదటి విడతలో శిక్షణ పొందిన కొంతమంది సేవకులకు రెండో విడతలో శిక్షణ ఇవ్వడంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా వారి అనుభవాలను ఇతర సేవకులతో పంచుకునే అవకాశం కల్పించారు.

మాస్టర్ ట్రైనర్ల పర్యవేక్షణ

భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌సీసీటీ మాజీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ హెచ్‌ఆర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి. శ్రీనివాస్, టీటీడీ సీపీఆర్‌వో డాక్టర్ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ, శ్రీవారి సేవా విభాగం సమన్వయకర్తలతో కలిసి ఈ శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

తమిళనాడుకు చెందిన సీనియర్ సేవక్ శ్రీ శరత్ తమిళ భాషా ప్రాంతాల శిక్షణ కార్యక్రమ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

తొలి విడతలో 1011 మందికి శిక్షణ

శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ తొలి విడత శిక్షణ గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమై 2026 ఫిబ్రవరి 7న ముగిసింది. మొత్తం 10 బ్యాచ్‌లలో సుమారు 1011 మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు. తొలి ఏడు బ్యాచ్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సేవకులు, చివరి మూడు బ్యాచ్‌లలో తమిళనాడు, కర్ణాటకతో పాటు హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన సేవకులు పాల్గొన్నారు.

మొదటి విడతలో వచ్చిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని రెండో విడతలో కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్దేశించడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. రెండో విడతలో 1,888 మంది గ్రూప్ సూపర్‌వైజర్లకు శిక్షణ అందించడంతో శ్రీవారి సేవను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు టీటీడీకి అందుబాటులోకి వచ్చారు.

ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌విచంద్ర‌, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంక‌య్య చౌద‌రి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు,  రామకృష్ణ మఠం స్వామీజీ, సత్య సాయి  నేషనల్ కోఆర్డినేటర్ టీటీడీ లోని వివిధ విభాగాల అధిప‌తులు, ఇతర సిబ్బంది ట్రైన‌ర్ల‌కు టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది.

No comments :
Write comments