తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులు అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందనున్నారు.
ఆగస్టు 14న శాత్తుమొర మహోత్సవం
ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆగస్టు 14న శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి మహోత్సవ ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక పూజల తర్వాత అలిపిరి నుండి రామనగర్ క్వార్టర్స్‌లోని గీతా మందిరం, ఆర్.ఎస్. మాడ వీధిలోని శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్ మఠం మీదుగా దివ్య ఊరేగింపు ఆలయానికి చేరుకుంటుంది.
రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో శాత్తుమొర నిర్వహించి ఉత్సవాలకు మంగళం పలుకుతారు.
ఈ దివ్యోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

No comments :
Write comments