13.8.26

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ hanumath vahanam



తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవ ఆలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇందులో భాగంగా అమావాస్యనాడు ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. రూ.500 చెల్లించి సేవలో పాల్గొన్న గృహస్తులకు (ఇద్దరికి) ఉత్తరీయం, రవికె, లడ్డూ, వడ ప్రసాదాలను అందజేశారు.

భక్తులను కనువిందు చేసిన హనుమంత వాహనసేవ

బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవను వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీరాముని పరమభక్తుడైన ఆంజనేయస్వామి వాహనంపై శ్రీ కోదండరామస్వామివారి దివ్యదర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి మంగళకర దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments