తిరుమలలో
శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ కశ్యప మహర్షి జయంతి సభా కార్యక్రమం ఆదివారం ఆస్థాన మండపంలో వైభవంగా జరిగింది.టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రణేతలలో ఒకరైన విఖనస మహర్షి శిష్యులైన శ్రీ కశ్యప మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.
విఖనస స్తోత్ర పాఠ పారాయణం, మంగళ నిరాజనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం వైఖానస పండితుల ప్రసంగాలు, చర్చాగోష్ఠి నిర్వహించారు.
ఈ సందర్భంగా భగవత్ శాస్త్ర పరంపరలో శ్రీ కశ్యప మహర్షి రచించిన ‘కశ్యప జ్ఞానకాండ’ గ్రంథ వైశిష్ట్యాన్ని పండితులు వివరించారు. శ్రీవారి ఆరాధనా విధానంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది శ్రీ వైఖానస దేవాలయాల్లో ఈ గ్రంథం అత్యంత ప్రామాణికంగా ఉపయోగంలో ఉందని తెలిపారు. వైఖానస ఆగమ సంప్రదాయంలో కశ్యప జ్ఞానకాండకు విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు.
పూజ్య పండితులు రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల పరిష్కరణతో కశ్యప జ్ఞానకాండ గ్రంథాన్ని టీటీడీ ముద్రించి భక్తులు, పండితులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
వైఖానస భగవత్ శాస్త్ర జ్ఞానం, దేవాలయ సంస్కృతితో ముడిపడిన ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్ది, సత్ప్రవర్తనతో కూడిన జీవనపథంలో నడిపించేందుకు దోహదపడుతున్నాయని వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి తిరుమల శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీమాన్ గంజాం ప్రభాకరాచార్యులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా. నారాయణం తనూజ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
వక్తలుగా డా. నారాయణం కాకుమాను సిద్ధాంతి, అలంకారరత్న శ్రీమాన్ ఎన్.వి.ఎన్. దీక్షితులు, శ్రీమాన్ GVLN శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవర్ధనం రఘునాథ్, వైఖానస విద్యార్థులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments