19.7.26

భక్తి పారవశ్యంలో రెండో రోజు ఉత్సవాలు day2




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు రెండవ రోజైన శనివారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. సందర్భంగా ఆలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దివ్యానుభూతిని కలిగించాయి.

వైభవంగా స్నపన తిరుమంజనం

ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీరు, వివిధ రకాల పండ్లరసాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

వైభవంగా హనుమంత వాహనసేవ - భక్తులను పరవశింపజేసిన వేళ

సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు విచ్చేసి భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.

సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జూలై 19 గరుడ వాహనంపై భక్తులకు అభయప్రదానం

సాక్షాత్కార వైభవోత్సవాల చివరి రోజైన జూలై 19 (ఆదివారం) రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు గరుడ వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య దర్శనం, అభయప్రదానం చేయనున్నారు.

కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఎంఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ హరికృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధనశేఖర్‌, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు walk path






అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు వో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను సూచించారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా చోటుచేసుకున్న వన్యప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర డేటా విశ్లేషణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచార మార్గాలు, వాటి కదలికల తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసి, భక్తులకు ప్రమాదం కలిగించే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే వన్యప్రాణుల సంచారానికి సంబంధించి ఇప్పటికే గుర్తించిన మూడు ప్రధాన ప్రమాద కారకాలను (రిస్క్ పారామీటర్లు) సమగ్రంగా పరిశీలించి, వాటి ప్రభావాన్ని తగ్గించే కార్యాచరణను రూపొందించాలని సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల సంఖ్య, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు.

అలిపిరి నడక మార్గంలోని దుకాణాల నిర్వహణ వల్ల వన్యప్రాణుల సంచారంపై, భక్తుల భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతోందో సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైతే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.

అడవిలో వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసి, ఆహార వ్యర్థాలు లేదా ఇతర చెత్త కారణంగా వన్యప్రాణులు నడక మార్గానికి ఆకర్షితులు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా, రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భక్తుల భద్రతకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు.

వన్యప్రాణుల సంచారాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు టీటీడీ, అటవీ శాఖ, విజిలెన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖలతో పాటు సంబంధిత అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచి, సమర్థవంతమైన మానిటరింగ్, సమాచార మార్పిడి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనకు చర్యలు చేపట్టాలని సూచించారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన అదనపు ఈవో, ఈ బృందానికి అవసరమైన సిబ్బంది, ఆధునిక పరికరాలు, వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచి, వన్యప్రాణుల ఘటనలు చోటుచేసుకున్న వెంటనే తక్షణమే స్పందించేలా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

అంతకుముందు టీటీడీ డీఎఫ్‌ఓ శ్రీ ఫణికుమార్ నాయుడు మాట్లాడుతూ, గత రెండేళ్లలో చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరు, వన్యప్రాణుల సంచార ధోరణులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ శ్రీ సాయిబాబా, టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, తిరుమల విజిలెన్స్ అధికారి శ్రీ సురేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ స్థానికాల‌యాల్లో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం anivara asthanam






తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీలక్ష్మి నారాయణ స్వామి ఆలయాలలో శుక్రవారం సాయంత్రం ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది.

ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం నాటి నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలకు మార్చారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం …..

శ్రీ గోవింద‌రాజ‌స్వామి వారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం  ఆస్థానం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ పుండ‌రీక వ‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి నూత‌న వ‌స్త్రాల‌ను విమాన ప్ర‌ద‌క్ష‌ణ‌గా తీసుకువ‌చ్చి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి స‌మ‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి,  డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ భాస్కర నారాయణ చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరామాలయంలో...

శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం సాయంత్రం ఆలయంలోని గరుడాళ్వార్‌ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ.ఎం. సురేష్ బాబు, శ్రీ బి.హరికృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

స్థానిక ఆలయాల్లో నారాయణవనం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం , కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఆణివార ఆస్థానం నిర్వహించారు.