రిలయన్స్
సంస్థ టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు, పవర్ సప్లై, డ్రైవర్ల నిర్వహణ, వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టీటీడీ నడుపుతున్న 15 బస్సులతో పాటు అదనంగా మరో పది బస్సుల కోసం మొత్తం 50 బస్సుల సామర్థ్యంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఒకేసారి 20 బస్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచాలని రిలయన్స్ బృందాన్ని కోరారు. 10x30 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఒక్కో బస్సులో 50 మంది సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
బస్సులు త్వరగా ఛార్జింగ్ అయ్యేందుకు వీలుగా 2 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. బస్సులను నడిపేందుకు 50 మంది నిపుణులైన డ్రైవర్లను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఒక షిఫ్టుకు 25 బస్సుల లెక్కన రెండు షిఫ్టుల్లో 50 బస్సులు తిప్పేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
బస్సుల పార్కింగ్ కోసం తగిన స్థలాన్ని గుర్తించి రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో చర్చించి త్వరితగతిన పూర్తిస్థాయి ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బస్సులో అధునాతన ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి రాబోయే బస్టాప్ ల వివరాలు భక్తులకు తెలిసేలా చర్యలు చేపట్టాలని చేపట్టాలని చెప్పారు.
ఈ సమావేశంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, ఐటీ జీఎం శ్రీ వేంకటేష్ నాయుడు, ఎలక్ట్రికల్ డీఈ శ్రీ చంధ్ర శేఖర్, ట్రాన్స్ పోర్ట్ డీఎం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, రిలయన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కార్తీక్ గణేసన్, సీనీయర్ జనరల్ మేనేజర్లు శ్రీ రాఘవేంద్ర, శ్రీ వినోద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments